మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రేమ పేరుతో యువతిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడు తేజ, స్థానికుల దాడిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానికంగా ఒక పాఠశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల వైష్ణవిని, 28 ఏళ్ల తేజ కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. వైష్ణవికి వివాహం నిశ్చయం కావడంతో, తేజ కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో శనివారం వైష్ణవిని రోడ్డుపై అడ్డగించి, కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో తేజను అడ్డగించి, బండరాళ్లతో దాడి చేశారు.
తీవ్ర గాయాలపాలైన తేజను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










