నిజామాబాద్, జూలై 7
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్‌ను దొంగిలించి విక్రయిస్తున్న అంతర్జిల్లా ముఠాను వేల్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఆరుగురు దొంగలతో పాటు, చోరీ సొత్తు కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై మొత్తం 19 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్‌ను చోరీ చేసి విక్రయిస్తున్న అంతర్జిల్లా ముఠాను వేల్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురు దొంగలతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్మూర్‌లోని పోచమ్మగల్లికి చెందిన కర్రే వినోద్ కుమార్, కర్రే విజయ్ కుమార్, అండ్రాసి నవీన్, గుంజోల్ల ఈశ్వర్, బాజ హరిప్రసాద్, మూల దుర్గాప్రసాద్ రెడ్డి కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. వీరికి ఆర్మూర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబా సహకరించినట్లు విచారణలో తేలింది.
పగటి వేళల్లో స్క్రాప్ కొనుగోలు చేస్తున్నట్లు గ్రామాల శివార్లలో తిరిగి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, రాత్రి సమయంలో వాటిలోని రాగి కాయిల్స్‌ను దొంగిలించి తిల్లి బాబాకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వేల్పూర్, బాల్కొండ, మెండోర, భీంగల్, ఆర్మూర్, యెర్గట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 19 చోరీ కేసుల్లో ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. మంగళవారం ఉదయం పడగల్ గ్రామ శివారులోని రైల్వే వంతెన సమీపంలో ఆరుగురు నిందితులను, అనంతరం ఆర్మూర్‌లో స్క్రాప్ వ్యాపారి తిల్లి బాబాను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల వద్ద నుంచి ఒక బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు, చోరీకి ఉపయోగించిన పనిముట్లు, 74 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించిన ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. జాన్ రెడ్డి, వేల్పూర్ స్టేషన్ హౌస్ అధికారి బి. సంజీవ్, బాల్కొండ ఎస్హెచ్ఓ కె. శైలేందర్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అభినందించారు.












