కామారెడ్డి, జులై 4
కామారెడ్డి పట్టణంలో జరిగిన రెండు వేర్వేరు చోరీ కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి పట్టణంలో జరిగిన రెండు వేర్వేరు చోరీ కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 29న వైశ్య భవన్లో జరిగిన శుభకార్యానికి వచ్చిన పెదపల్లికి చెందిన వోలెల్ల నందిని తన బ్యాగులో ఉంచిన సుమారు 12 గ్రాముల బంగారు చెవి దిద్దులు, గొలుసు చోరీకి గురయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ఆధారంగా డ్రైవర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మొహమ్మద్ అఫ్సర్ అలీని అదుపులోకి తీసుకోగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.
అలాగే జూన్ 28న గంజి రోడ్డులోని కొత్తూరి పద్మ ఇంట్లో బీరువాలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన కేసును కూడా పోలీసులు ఛేదించారు. హరిజనవాడకు చెందిన చింతకింద బాలమురళీకృష్ణను అరెస్టు చేసి విచారించగా, బాధితురాలు తనకు బంధువు కావడంతో ఇంటి తాళాలు, నగలు ఉంచే స్థలం తెలిసి చోరీ చేసినట్లు అంగీకరించాడు.
చోరీ చేసిన ఆభరణాల్లో కొన్నింటిని IIFL, Capri Gold Loans సంస్థల్లో తాకట్టు పెట్టగా, మరికొన్నింటిని తన టిఫిన్ సెంటర్లో దాచినట్లు వెల్లడించాడు. పోలీసులు అన్ని ఆభరణాలను స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా ఉంచవద్దని, ఇళ్లలో భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కామారెడ్డి పోలీసులు ప్రజలకు సూచించారు.











