కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను పోక్సో కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం అతన్ని మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. నార్సింగి పరిధిలోని టీఎస్పీఏ వద్ద రాత్రి 8:15 గంటలకు అరెస్ట్ చేసినట్లు, విచారణ నిమిత్తం అతన్ని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.రమేష్ తెలిపారు.
రాత్రి 9:05 గంటలకు భగీరథ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. విచారణాధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో రెండున్నర గంటలపాటు విచారణ జరిగింది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు, పోలీసుల రిపోర్టును పరిశీలించిన మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.
శనివారం ఉదయం నుంచే భగీరథ్ అరెస్టుపై ఉత్కంఠ నెలకొంది. పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్, పుణె, బెంగళూరులో 14 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. భగీరథ్‌పై లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు.
పోక్సో కేసుకు సంబంధించి ఫిర్యాదుదారులైన బాలిక తల్లి, బాధిత బాలిక వాంగ్మూలాలను పోలీసులు మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేయించారు. ఈ కేసులో కీలక ఎలక్ట్రానిక్, డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ చాట్లను సేకరించినట్లు డీసీపీ రితిరాజ్ బృందం తెలిపింది.









