రాజస్థాన్‌కు చెందిన అడిషనల్ జడ్జి రాజ్ కుమార్ చౌహాన్ తన భార్య ఉషతో కలిసి ప్రయాణిస్తున్న కాచిగూడ, బగత్ కీ కోటి ఎక్స్‌ప్రెస్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. భార్య రైలు వాష్‌రూమ్‌లో మృతిచెందిన విషయం తెలియక, భర్త తన గమ్యస్థానంలో దిగిపోయాడు.
నిమ్బెహర స్టేషన్లో దిగాల్సి ఉండగా, రైలు ఆగేముందు ఉష వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. జడ్జి తన లగేజీతో దిగిపోయారు. భార్య తనకంటే ముందే దిగిపోయిందని భావించిన ఆయన, రైలు కదిలిపోయాక ఆమె కోసం వెతికారు. స్టేషన్లో కొంతసేపు చూసిన తర్వాత, భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి, ఉష రైలు దిగలేదని నిర్ధారించుకున్నారు. వెంటనే, అవతలి స్టేషన్లకు సమాచారం అందించారు. దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జవోర స్టేషన్లో రైలును ఆపి, వాష్‌రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా, ఉష అచేతనంగా పడి ఉంది.
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. ఒకే బోగీలో ప్రయాణిస్తున్న భార్య మృతి చెందిన విషయం తెలియకుండానే భర్త దిగిపోవడం, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జీవిత ప్రయాణం రైలు ప్రయాణంలో ఇలా ముగియడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు.

