నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విశేష సేవలందించిన ఆరుగురు పోలీసు సిబ్బందికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ చేసిన వారిని శాలువాలు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
పదవీ విరమణ పొందిన ఆరుగురు సిబ్బందిలో కార్యాలయ సూపరింటెండెంట్ అహమ్మద్ అబ్దుల్ బషీర్, సీసీఆర్బీ ఎస్సై బాదావత్ శివరాం, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై గైక్వాడ్ అప్పారావు, మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై సేరుపల్లె మొగులయ్య, సీఎస్బీ ఏఎస్సై మువ్వ లింగారావు, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మస్కే జీవన్ ఉన్నారు. వీరు సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ, పోలీసు శాఖకు వారు అందించిన సేవలను కొనియాడారు. క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేయడం గొప్ప విషయమని అన్నారు. వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం కూడా శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. పదవీ విరమణ పొందిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, హోంగార్డ్స్ ఏసీపీ కె. దీపక్ చంద్ర, పలువురు అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












