తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్రంలో ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs) ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిజామాబాద్–కరీంనగర్–వరంగల్ హైవేల వెంట జీసీసీలు, ఐటీ సంస్థలు ఏర్పాటు అయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 'బియాండ్ హైదరాబాద్' ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ, జిల్లాల్లో ఐటీ విస్తరణ ద్వారా యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
అదనంగా, డేటాసెంటర్ల ఏర్పాటుకు కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై కూడా సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
ఫ్యూచర్ సిటీలో నెట్-జీరో విధానాలు అమలు చేయాలని, ప్రపంచ స్థాయి ఏఐ సదుపాయాలతో 'ఏఐ సిటీ'ని అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే హెల్త్ సిటీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ సిటీ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వ సహకారం కోసం చర్చలు జరపాలని సీఎం సూచించారు. కంపెనీలు భూమిపూజలకు సిద్ధంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించే దిశగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కంపెనీలు ఎంఓయూలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు 'ఇన్వెస్ట్ తెలంగాణ' పేరుతో ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు అందించే విధానాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించాలని ఆదేశించారు. టీ-ఫైబర్ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.54 కోట్లు విడుదలైనట్లు అధికారులు వెల్లడించారు.











