తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర ఆవిర్భావం వెనుక అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం 12 వసంతాలు పూర్తి చేసుకుని, 13 వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుల ఆశయ సాధనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పౌరులుగా, తెలంగాణ బిడ్డలుగా మనవంతు కృషి చేయాలని ఆయన సూచించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పడటం, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడటం వంటి అంశాలను ఎస్పీ ప్రస్తావించారు. ప్రతి పోలీసు అధికారి, యువత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తమ బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎందరో అమరవీరుల ఆత్మ బలిదానాలు, మహనీయుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎస్పీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండి, మహనీయుల ఆశయ సాధనలో తెలంగాణ పౌరులుగా మనవంతు కృషి చేయాలని ఆయన మరోసారి సూచించారు. జిల్లా పోలీసు శాఖ తరపున కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఆన్లైన్ మోసాలు, పోక్సో అత్యాచార కేసుల వంటి వాటిపై జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఏ.ఆర్. డీఎస్పీ నరేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఐ. టి. సెల్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్.ఐ.లు సురేష్, డానియెల్, శ్రీనివాస్ రావ్, డి.పి.ఓ సూపర్డెంట్ మోహనప్ప, అశోక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు.











