సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల నివారణకు సంబంధించిన కీలక సూచనలు అధికారులు ప్రజలకు వివరించారు.
దేవునిపల్లి మండలంలోని లక్ష్మీదేవి గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో, సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, నకిలీ లింక్‌ల ద్వారా ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో వివరించారు. బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల ప్రతినిధుల పేరుతో ఎవరైనా ఓటీపీ, బ్యాంకు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని హెచ్చరించారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు. అప్రమత్తంగా ఉండటం ద్వారా వ్యక్తిగత, ఆర్థిక భద్రతను కాపాడుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
పోలీస్ కళాబృందం మాటలు, పాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించింది. ఈ ప్రదర్శనలను కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆసక్తిగా వీక్షించారు. కామారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.











