ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి 'తెలంగాణ రైజింగ్-2047' మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన అత్యవసరమని, హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కేవలం రోడ్ల విస్తరణతో పాటు మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ధి, మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రాన్ని CURE (సర్వీస్ సెక్టార్), PURE (మాన్యూఫ్యాక్చర్ సెక్టార్), RARE (అగ్రికల్చర్ సెక్టార్) అనే మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలను ఈ విధంగా వర్గీకరించినట్లు తెలిపారు.
మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చేందుకు రెట్రో ఫిట్టింగ్ ఉచితంగా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.









