ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, మాల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తోందని మాల మహానాడు ఆరోపించింది. ప్రభుత్వం వెంటనే హామీలను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డా. రంజిత్ కుమార్ మండ మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ మాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పటికే 11 కార్పొరేషన్లు ప్రకటించినప్పటికీ మాల కార్పొరేషన్‌ను మాత్రం కావాలనే పక్కన పెట్టడం దళితుల పట్ల వివక్షకు నిదర్శనమని అన్నారు.
ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లో ఒక్క దళితుడికి కూడా స్థానం కల్పించకపోవడం అత్యంత అవమానకరమని, ఇది దళితులను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారని తెలియజేస్తోందని ఆయన విమర్శించారు.
30 సంవత్సరాలుగా మాల జాతి కోసం పోరాటం చేస్తున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పేరును వెంటనే ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవంతో ఆటలాడితే ప్రభుత్వం రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు మాల సమాజం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మాల కార్పొరేషన్‌ను వెంటనే ప్రకటించాలని, దళితులకు రాజకీయ, సామాజిక న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









