రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 15వ తేదీలోగా ఆప్షన్ ఫారాలను సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,213 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ప్రస్తుత స్థానంలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కార్యదర్శులు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరి బదిలీలు, భార్యాభర్తల సర్వీస్, వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోరుకునేవారు తమ ఆప్షన్లను తెలియజేయాలని సూచించారు. అర్హులైన కార్యదర్శుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ధ్రువీకరించిన అనంతరం 15వ తేదీ సాయంత్రంలోపు కమిషనర్ కార్యాలయానికి పంపాలని నిర్దేశించారు.
రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా, 2026 మే 1 నాటికి 1,213 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కుమ్రంభీం జిల్లాలో 78, కామారెడ్డిలో 68, జనగామలో 64 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 12 ఖాళీలు ఉండగా, హన్మకొండ, వరంగల్, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 14 చొప్పున ఖాళీలు ఉన్నాయని సమాచారం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గ్రామ పంచాయతీలు లేకపోయినా 18 ఖాళీలు చూపడం గమనార్హం.
జోన్ల వారీగా చూస్తే, కాళేశ్వరం జోన్లో 208, బాసర జోన్లో 126, రాజన్న సిరిసిల్ల జోన్లో 216, భద్రాద్రి జోన్లో 164 ఖాళీలు ఉన్నాయి. యాదాద్రి జోన్లో అత్యధికంగా 258 ఖాళీలు ఉండగా, చార్మినార్ జోన్లో 81, జోగులాంబ జోన్లో 160 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.










