సర్పంచులు తమకు అందిన శిక్షణను సద్వినియోగం చేసుకుని, గ్రామాల సమగ్రాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని, ప్రజలకు పారదర్శక పాలన అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ, గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సర్పంచులు పని చేయాలని పిలుపునిచ్చారు. శిక్షణలో పొందిన అవగాహనను గ్రామాల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శక పాలన అందించడం సర్పంచుల ప్రధాన బాధ్యత అని, నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ, అన్ని వర్గాల సమన్వయంతో గ్రామాల సమగ్రాభివృద్ధి సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి స్పందించాలని, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
గ్రామ పంచాయతీలను ఆదర్శవంతమైన స్థానిక సంస్థలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి పాటించాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, మాస్టర్ ట్రైనర్లు, సర్పంచులు పాల్గొన్నారు.


