తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ఎన్నికల హామీల అమలుకు తగినన్ని నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, కార్మికుల శ్రమదోపిడీని అరికట్టాలని ఆమె కోరారు.
హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌కు సంబంధించి ఇప్పటికే బిల్లు ఆమోదం పొందిందని, కొత్తగా చేయాల్సింది ఏమీ లేదని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విలీనం చేస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ఆమె గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, చిన్న కారణాలతో తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని, రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని ఆమె విమర్శించారు. టికెట్ మిషన్ పనిచేయకపోయినా కండక్టర్లపై చర్యలు తీసుకోవడం అన్యాయమని, డ్రైవర్లపై అధిక ఒత్తిడితో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సులు నడపడం వల్ల బస్సుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె అన్నారు.
ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల స్థానంలో శాశ్వత నియామకాలు చేపట్టాలని సూచించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత తీసుకోవాలని, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్, పీఆర్సీ, జీతాలు అమలు చేయాలని ఆమె కోరారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.
ఆర్టీసీని మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అప్పగించే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. గతంలో కేబినెట్ సమావేశాలు రాష్ట్రంలో జరిగేవని, ఇప్పుడు ఢిల్లీలో నిర్వహించడం తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నెల 24న ఆర్టీసీ కార్మికులు నిర్వహించే “ఛలో సెక్రటేరియేట్” కార్యక్రమానికి తెలంగాణ జాగృతి పూర్తి మద్దతు ప్రకటించింది.


