ఆహార భద్రత చట్టం-2013ను పకడ్బందీగా అమలు చేసి, పేదలకు ధాన్యాలు, పౌష్టికాహారం సకాలంలో అందేలా చూడాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కమిషన్ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లాలోని రామిరెడ్డి మండలంలో క్షేత్ర పర్యటన అనంతరం, కలెక్టరేట్ లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అమలు అవుతున్న పథకాలు, రేషన్ దుకాణాల పనితీరు, ధాన్యాల పంపిణీ, ఇ-పోస్ లావాదేవీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై చర్చించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలు, తక్కువ బరువున్న పిల్లలకు కోడిగుడ్లు తప్పనిసరిగా అందించాలని సూచించారు. PM POSHAN, ఐసీడీఎస్ పథకాల అమలు, ప్రసూతి ప్రయోజనాల పంపిణీపై అధికారులు వివరణ ఇచ్చారు. సామాజిక తనిఖీలు, విజిలెన్స్ కమిటీల పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. చట్టం అమలులో ఎటువంటి రాజీ పడకూడదని చైర్మన్ నొక్కి చెప్పారు.


