రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతుల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.
కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు ఆందోళన చెంది ఒకేసారి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని నింపుకోవడం వల్ల పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగి, సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, సరఫరా యథావిధిగా కొనసాగుతోందని ఆయన భరోసా ఇచ్చారు.
అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, దీనివల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, నిర్ధారించని సమాచారాన్ని పంచుకోవడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.
వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.










