మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 40 ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జరగనున్నాయి.
జిల్లాలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సి ఉమా గౌరీ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీతో పాటు డీసీఏ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన స్థానికులై ఉండాలి.
అర్హత కలిగిన అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్సైట్ https://medchal-malkajgiri.telangana.gov.in నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధృవీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులు, రూ.500 విలువైన డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ “డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్” పేరు మీద ఉండాలి.
దరఖాస్తులను మార్చి 11, 12, 13, మరియు 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, ఎఫ్–1, ఐడీఓసీ, అంతాయిపల్లి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో సమర్పించాలి. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

