రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులకు పూర్తి అవగాహన ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, ఈనెల 12వ తేదీన నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని పెంచడమేనని సీఎస్ తెలిపారు.
జూన్ 12 వరకు కొనసాగనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ శిక్షణ ఉంటుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ప్రజలకు చేరుతాయని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,000 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఈ శిక్షణలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
శిక్షణ కార్యక్రమాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్లకు సూచించిన సీఎస్, కొత్తగా ఎన్నికైన ప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, శిక్షణ వేదికల వద్ద జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేసేలా ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు.
99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్, పారిశుధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్లను సీఎస్ అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీ రాజ్, మున్సిపల్ పరిపాలన, సెర్ప్, ప్రణాళికా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

