సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి రంగంలో అద్భుతాలు సృష్టించగలరని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ (టీఎన్జీవోస్) ఆధ్వర్యంలో సంగారెడ్డిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల జయప్రకాశ్ రెడ్డి మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎదగాలని సూచించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, క్యాంటీన్ల నిర్వహణ, యూనిఫామ్ ల కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం వంటి చర్యలు చేపట్టిందని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ, మహిళలు సహనం, పట్టుదలకు ప్రతిరూపాలన్నారు. అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతూ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. కుటుంబ, ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కోసం నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


