తెలంగాణ పోలీసుల ముందు ఒక మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. వీరిలో ఒకరైన పసునూరి నరహరి, మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాలుగా క్రియాశీలకంగా ఉన్నారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో నరహరితో పాటు ఆయన భార్య ధనమ్మను పోలీసుల సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు.
లొంగిపోయిన ఈ దంపతులకు డీజీపీ సీవీ ఆనంద్ రూ. 25 లక్షలు, రూ.20 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఇంకా అజ్ఞాతంలో ఉన్న 47 మంది మావోయిస్టులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 15, జార్ఖండ్ 13, ఒడిశాకు చెందిన 15 మంది ఉన్నారని పేర్కొన్నారు.
2024 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు మొత్తం 822 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. వీరంతా 334 ఆయుధాలను సమర్పించినట్లు తెలిపారు. గతంలో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన ఒడిశాకు చెందిన మావోయిస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని, తెలంగాణకు చెందిన మావోయిస్టులను త్వరలో వారి ప్రాంతాలకు వెళ్లి స్వయంగా కలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ గణపతి, జాడే రత్న బాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగులు లొంగిపోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వారు లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని ప్రయోజనాలు, సదుపాయాలు కల్పిస్తామని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు హామీ ఇచ్చారు.











