తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
జూన్ 2న జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆయన సూచనలు చేశారు.
కార్యక్రమంలో భాగంగా పతాకావిష్కరణ, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు సమర్పణ, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
వేడుకల నిర్వహణకు అవసరమైన స్టేజీ, మైక్, సౌండ్ సిస్టమ్, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పార్కింగ్ వంటి అన్ని మౌలిక సదుపాయాలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించి, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులను కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ విక్టర్, ఏసీఎల్బీ ఎన్వీ గిరి తదితరులు పాల్గొన్నారు.












