పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వార్తలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి వెలువడిన ఒక ప్రకటనలో, కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, సరఫరా వ్యవస్థ యథావిధిగా కొనసాగుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మి ప్రజలు భయపడద్దని సూచించారు.
అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలు అనవసరమైన ఆందోళనకు దారితీస్తాయని, భద్రతాపరమైన సమస్యలను సృష్టిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని కమిషనర్ గౌష్ ఆలం కోరారు. అత్యవసర పరిస్థితులు ఏవీ లేవని, కావున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ హెచ్చరిక జారీ చేశారు. ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.










