రాష్ట్రంలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. ప్రజలు పుకార్లను నమ్మి గందరగోళానికి గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి N. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న భారీ క్యూలు సరఫరా లోపం వల్ల కాకుండా, వదంతుల ప్రభావంతో వినియోగదారులు అధికంగా కొనుగోళ్లు చేయడమే కారణమని ఆయన తెలిపారు.
శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, “రానున్న మూడు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ పుకార్లను నమ్మవద్దు” అని విజ్ఞప్తి చేశారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం రోజువారీగా 17,246 కిలోలీటర్ల డిమాండ్ ఉన్నప్పటికీ, 17,898 కిలోలీటర్ల సరఫరా జరుగుతోందని మంత్రి వివరించారు. అంటే 652 కిలోలీటర్ల అదనపు నిల్వ అందుబాటులో ఉందన్నారు. అదనంగా 16,000 కిలోలీటర్ల రిజర్వ్ నిల్వతో పాటు 1,200 ట్యాంకర్లు సరఫరా వ్యవస్థలో వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
వినియోగదారుల భయాందోళనల కారణంగా డిమాండ్ ఒక్కసారిగా 25% పెరిగినా, సరఫరా వ్యవస్థలో ఎటువంటి అంతరాయం లేకుండా 22% అదనపు నిల్వలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కొన్ని పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు ఆలస్యంగా చేరడం వల్ల తాత్కాలికంగా ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని, అయితే వాస్తవానికి ఎక్కడా కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. వదంతులను నమ్మి కంటైనర్లు, డబ్బాలలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవడం చట్ట విరుద్ధమేకాక ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి కొరత లేదని, అయితే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంత సమస్య ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అక్రమ వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటూ 2,952 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంధన కొరత అన్నది లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మకుండా సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు.











