కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువులో ముందస్తు వరద సహాయక చర్యలపై సమగ్ర మాక్ డ్రిల్ విజయవంతంగా పూర్తయింది. జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం, విపత్తు పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సమన్వయంతో, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించగా, వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే విధానాలను ప్రదర్శించారు. రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్ల సహాయంతో నిర్వహించిన రక్షణ చర్యలు ప్రతిభావంతంగా సాగాయి. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక, పోలీస్, వైద్య, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర మొత్తం 12 శాఖలు చురుకుగా పాల్గొన్నాయి. సుమారు 187 మంది అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుల సమయంలో శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన స్పందన, ప్రజల అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. మాక్ డ్రిల్‌ల ద్వారా ప్రజల్లో అప్రమత్తత పెంపొందించడంతో పాటు, విపత్తు సమయంలో భయపడకుండా సరైన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గించవచ్చని అన్నారు.
మాక్ డ్రిల్ ద్వారా ప్రమాద సమయంలో వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలే విధానం, వరదలు, తుఫానుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిక్కుకుపోయిన వారిని రక్షించే పద్ధతులు, అత్యవసర సేవలను సంప్రదించే విధానం, గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించే మార్గాలు వంటి అంశాలపై అవగాహన కలిగింది. ఇటువంటి మాక్ డ్రిల్లు ప్రజలకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించి, విపత్తుల సమయంలో సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని పెంచుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. NDRF బృందాలు విపత్తు సమయంలో వేగంగా స్పందించి ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, డిప్యూటీ కమాండర్ డోల్ సింగ్, జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్, ఆర్డీవో వీణ, తహసిల్దార్ హిమబిందు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











