కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు 8వ విడత టీకా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ కార్యక్రమాన్ని మాచారెడ్డి మండలంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 9 వరకు కొనసాగుతుంది.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి పశువుల ఆరోగ్యంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, టీకాల ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించవచ్చని తెలిపారు. ఈ టీకా కార్యక్రమం జిల్లాలోని 25 మండలాల్లో 1,42,400 ఆవులు, గేదెలకు టీకాలు వేసే లక్ష్యంతో చేపట్టారు.
మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని, ఇవి ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తాయని కలెక్టర్ వెల్లడించారు. గాలికుంటు వ్యాధి వల్ల పాల ఉత్పత్తి తగ్గడం, బరువు తగ్గడం, వంధ్యత్వం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన వివరించారు.
ప్రతి పశువుకు టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. పశువైద్య బృందాలు గ్రామాలకు వచ్చినప్పుడు రైతులు తమ పశువులను సిద్ధంగా ఉంచి సహకరించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

