రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, జిల్లెల్ల గ్రామంలో ప్రమాదంలో మృతి చెందిన గీత కార్మికుడు సాయిలి కిషన్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు.
చెట్టుపై నుండి కింద పడి మృతి చెందిన కిషన్ గౌడ్ కుటుంబ సభ్యులను నేరుగా కలిసి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం నింపారు.
మృతుడి ఇద్దరు పిల్లల పేరుమీద చెరో లక్ష రూపాయల చొప్పున, మొత్తం రూ. 2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి, డిపాజిట్ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
గీత కార్మికుల జీవితాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ఎక్స్గ్రేషియా, ఇతర సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా చూడాలని స్థానిక నాయకులకు, అధికారులకు సూచించారు.

