తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగింది. రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని అర్హులైన వారికి ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఇతర సహాయక ఉపకరణాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం 64 మంది దివ్యాంగులకు ఈ ఉపకరణాలు పంపిణీ చేశారు.
సహాయ ఉపకరణాలు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా అన్నారు.
దివ్యాంగులు, విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి అర్హుడికి పథకాల లబ్ధి అందేలా అధికారులు చూడాలని మంత్రి సూచించారు. దివ్యాంగులు సమాజంలో ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ఉపకరణాలు తోడ్పడతాయని ప్రజా ప్రతినిధులు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, దివ్యాంగుల పథకాలను మరింత విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.












