కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తాగునీరు, సాగునీరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, వడదెబ్బ నివారణ చర్యలపై సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో తాగునీటి సరఫరా, సాగునీటి పరిస్థితి, సివిల్ సప్లై, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఎండాకాలంలో వడదెబ్బల నివారణ చర్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న 99 సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిపై అధికారులు మంత్రికి వివరించారు. పలు కీలక అంశాలపై చర్చించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని అధికారులకు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తాగునీటి సరఫరా, సాగునీటి అవసరాలు సకాలంలో తీర్చాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని, అర్హులందరికీ ప్రయోజనం చేకూరేలా చూడాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ కూడా జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సివిల్ సప్లైలో నాణ్యత, తాగునీటి సమస్యల నివారణ, వడదెబ్బ నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుతో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ షట్కర్ తెలిపారు.












