ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇందులో జాప్యం సహించేది లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు ఫైజన్ అహ్మద్, విజయేందర్ రెడ్డిలతో కలిసి డీసీలు, ఏఆర్ఓలు, ఈఆర్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, 2002 నాటి ఓటరు జాబితాను 2025 జాబితాకు అనుగుణంగా సవరించే ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓలకు ఓటర్ల జాబితాలను కేటాయించే సమయంలో పనిభారం సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సమతుల్యత పాటించాలని సూచించారు.
ప్రస్తుతం మ్యాపింగ్ ప్రక్రియ 10 నుంచి 20 శాతానికి మించి నమోదు కాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వచ్చే సమీక్షా సమావేశం నాటికి స్పష్టమైన పురోగతి కనిపించని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.











