హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తూ ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఇతరులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించరాదని ఆయన హెచ్చరించారు.
పండుగ సమయంలో బలవంతంగా రంగులు చల్లడం, గుంపులుగా తిరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. యువత అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు సున్నిత ప్రదేశాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
హోలీ అనంతరం చెరువులు, లోతట్టు ప్రాంతాలలో స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఎస్పీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.


