సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల సంరక్షణ, దత్తత ప్రక్రియను వేగవంతం చేయడం మరియు వయోవృద్ధుల సంక్షేమ సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సోమవారం శిశు గృహ కేంద్రం, డే కేర్ సెంటర్ను సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మహిళా ప్రాంగణంలోని శిశు గృహ కేంద్రానికి వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందుతున్న ఏడుగురు చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, వైద్య సేవలు, మరియు దత్తత ప్రక్రియపై అధికారులతో చర్చించారు. దత్తత ప్రక్రియ సజావుగా సాగుతోందని అధికారులు తెలిపారు. చిన్నారులకు అత్యుత్తమ సేవలు అందించాలని, ఏవైనా సమస్యలుంటే వెంటనే నివేదించాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం, ప్రణామ్ డే కేర్ సెంటర్ను సందర్శించి, వృద్ధులతో నేరుగా మాట్లాడి అక్కడి సదుపాయాలపై ఆరా తీశారు. క్యారం, చెస్, పత్రికలు, టీవీ వంటి సదుపాయాలతో వృద్ధులు సంతోషంగా సమయం గడుపుతున్నారని, భోజనానికి ఇంటికి వెళ్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వారి సామాజిక జీవితాన్ని మెరుగుపరచడానికి డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసిందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. వృద్ధులు ఈ కేంద్రాల సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెంటర్కు వచ్చే వృద్ధులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని అధికారులకు సూచించారు.
డే కేర్ సెంటర్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫిజియోథెరపీ సామగ్రి అందుబాటులో ఉంచాలని, సేవలను మరింత మెరుగుపరచాలని సిబ్బందికి కలెక్టర్ సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డిసిపి రత్నం, మేనేజర్ మొగులయ్య, సఖి సీఏ కల్పన, డే కేర్ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి పాల్గొన్నారు.


