కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో గురువారం జరిగిన బాడీ సమావేశం గ్రామ నిధుల వినియోగంలో పారదర్శకత లేదనే ఆరోపణలతో వార్డు సభ్యుల నిరసనల మధ్య ముగిసింది. పలువురు వార్డు సభ్యులు సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించారు.
గ్రామ నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందని, బాడీ తీర్మానం లేకుండా భారీ మొత్తంలో బిల్లులు తీసుకున్నారని వార్డు సభ్యులు తగిరంచ రమాదేవి, దేవోల్ల ప్రత్యూష, జ్యోతి, వెంకట్ స్వామి గౌడ్, నర్సింలు ఆరోపించారు. కేవలం నాలుగు నెలల్లో రూ.11 లక్షల బిల్లులు తీసుకున్నారని, పాత పెండింగ్ బిల్లులు మాత్రం క్లియర్ చేయలేదని వారు తెలిపారు.
సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్‌ను ప్రశ్నించినప్పుడు, తీర్మానం లేకుండా నిధుల వినియోగంపై సరైన వివరణ లభించలేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2026 నాటి బిల్లులకు 2023-24 నాటి జియో ట్యాగ్ ఫొటోలు ఎలా జతచేశారని, పాత పనులను కొత్తవిగా చూపిస్తున్నారా అని వారు నిలదీశారు.
పాత బకాయిల చెల్లింపుల గురించి అడిగినప్పుడు, "నేను రూ.30 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాను.. అందరికీ ఇస్తూ పోతే నాకు ఏమి మిగులుతుంది" అని సర్పంచ్ వ్యాఖ్యానించారని సభ్యులు ఆరోపించారు. ఇది తమను తీవ్రంగా బాధించిందని వారు పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లినప్పుడు వార్డు సభ్యుల ఫోన్లను తీసుకుని పక్కన పెట్టడం, ప్రజాప్రతినిధులను అవమానించడమేనని విమర్శించారు.
గ్రామ ప్రజల డబ్బు వినియోగంలో స్పష్టత లేదని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు అవే అంశాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయని తెలిపారు. ప్రశ్నించినప్పుడు స్పందించకుండా, వార్డు సభ్యులను పట్టించుకోకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అవసరమైతే తదుపరి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.












