కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు సోమవారం అల్లాపూర్ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కల్వర్టుల నిర్మాణం, రోడ్ల విస్తరణ, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులపై ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అల్లాపూర్ డివిజన్లోని సబ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, అల్లాపూర్, శివాజీ నగర్, రామారావు నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సబ్దర్ నగర్ వాసవి దగ్గర కల్వర్టుల నిర్మాణం, రాజీవ్ గాంధీ నగర్ సి బ్లాక్ నుండి ఎ బ్లాక్ వరకు రోడ్డు వేయాలని ప్రజలు కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
రాజీవ్ గాంధీ నగర్, అల్లాపూర్ ప్రాంతాల్లో స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రామారావు నగర్ లో పెండింగ్లో ఉన్న నాలా పనులను వెంటనే పూర్తి చేయాలని, సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ వేసి, శాంక్షన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. శివాజీ నగర్ వాసులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోరడంతో, ఎమ్మెల్యే స్థలాన్ని పరిశీలించి, సాధ్యమైనంత త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రిష్ణారావు మాట్లాడుతూ, ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా ఆర్థికంగా చేయూతనిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని, శానిటేషన్ లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పర్యటనలో అల్లాపూర్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మేడ్చెల్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మొహమ్మెద్ గౌసుద్దీన్, పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

