2027లో జరగనున్న జనాభా లెక్కల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కల్పించేందుకు కామారెడ్డిలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ కార్యాలయం నుంచి వచ్చిన ట్రైనర్లు పలు కీలక అంశాలపై శిక్షణ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ శిక్షణను నిర్వహించారు. జనాభా లెక్కల నిర్వహణలో అధికారుల పాత్ర, చట్టపరమైన నిబంధనలు, నిధులు, మానవ వనరుల వినియోగంపై ట్రైనర్లు వివరణ ఇచ్చారు.
జనాభా గణనకు అవసరమైన పునాది విధానాలు, భావనలు, నిర్వచనాలు, HLO ప్రశ్నల అవలోకనంపై అధికారులు శిక్షణ పొందారు. CMMS (Census Management & Monitoring System) వాడకం, డేటా ఎంట్రీ ప్రక్రియ, ఛార్జ్ రిజిస్టర్ల తయారీ, డాష్బోర్డ్ వినియోగంపై ట్రైనర్లు మార్గనిర్దేశం చేశారు.
శిక్షణలో భాగంగా శిక్షణ నిర్వహణ, నియామక లేఖలు, ఐడి కార్డుల తయారీ, లాజిస్టిక్స్, ప్రింటింగ్ నిర్వహణ వంటి అంశాలపై కూడా సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీవో, తహసిల్దార్లు, ఎంపిడిఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.








