ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు.
జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబజార్ ప్రాంతానికి చెందిన సాంబ పూర్ణచంద్రరావు తమ పట్టా భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి గృహ నిర్మాణం చేపడుతున్నారని, తగిన చర్యలు తీసుకొని భూమిని తిరిగి అప్పగించాలని కోరిన దరఖాస్తును పరిశీలించి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఎండార్స్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సాయినగర్ కాలనీ ప్రజలు తమ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం లక్ష్మీదేవిపల్లి ఎంపీడీవోకు ఎండార్స్ చేశారు.
టేకులపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన అశోక్ తమ గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరించడంతో పాటు బోర్లను మరమ్మతు చేయాలని చేసిన దరఖాస్తును మిషన్ భగీరథ అధికారులకు, మణుగూరు మండలం విట్టల్‌రావు నగర్‌కు చెందిన రావుల రాములు వివాదంలో ఉన్న భూమిపై సర్వే ప్రక్రియతో పాటు భూమి పరిహారం చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేయాలని చేసిన దరఖాస్తును భూసేకరణ అధికారులకు, ములకలపల్లి మండలం మాదారం గ్రామపంచాయతీలో పాలకవర్గాలు లేని సమయంలో నిర్వహించిన ఖర్చులు, అప్పుల వివరాలను తెలియజేయాలని ఉకంటి రవికుమార్ చేసిన దరఖాస్తును జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు.











