దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు చరిత్రను రాస్తారని మరోసారి నిరూపితమైందని అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును తెలియజేస్తున్నాయని, అస్సాంలో బీజేపీ విజయం పార్టీపై విశ్వాసాన్ని సూచిస్తోందని ఈటెల రాజేందర్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి, తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి ఎదుగుదల వంటివి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వంపై రెండేళ్లకే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఈటెల విమర్శించారు. విద్యార్థులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం నిష్క్రియంగా మారిందని, ప్రజలు మార్పును ఆశిస్తున్నారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణలో పర్యటించనున్నారని, ఇది తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందనడానికి సంకేతమని ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మోదీ సభకు సిద్దిపేట జిల్లా నుంచి భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్, సీనియర్ నాయకులు రాంరెడ్డి, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.












