నాగిరెడ్డి పేట్ మండలం పరిధిలోని మెట్లకుంట తండా, బేజ్గం చెరువు తండా, పల్లెబోగుడు తండా గ్రామస్థులు, నాయకులు మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్, ఎమ్మెల్యే మదన్ మోహన్ పై చేస్తున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. తండాలలో అభివృద్ధి జరగడం లేదంటూ సురేందర్ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు మీడియా సమావేశంలో బహిరంగంగా తోసిపుచ్చారు.
జజాల సురేందర్ హయాంలో అభివృద్ధికి నోచుకోని తండాలు, ప్రస్తుతం ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని వారు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో మెట్లకుంట, బేజ్గం చెరువు, పల్లెబోగుడు తండాలలో సుమారు ₹15 లక్షల విలువైన సీసీ రోడ్లు నిర్మించబడ్డాయని తెలిపారు.
తాగునీటి సమస్య పరిష్కారం కోసం మూడు బోర్లు, మోటార్లు ఏర్పాటు చేయడం, 11 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం, ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణానికి ₹2 లక్షలు కేటాయించడం వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని వారు గుర్తు చేశారు. CMRF, కళ్యాణ లక్ష్మి చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందిస్తున్న ఘనత కూడా ఎమ్మెల్యే మదన్ మోహన్ దేనని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సురేందర్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, "మా తండా ప్రజలమంతా కలిసి నీ కోసం ₹5000 రూపాయలు కూడగట్టి ఇచ్చాము. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీతో గెలిచి, స్వార్థం కోసం BRS పార్టీకి అమ్ముడుపోయి ఎల్లారెడ్డి ప్రజలను మోసం చేసిన చరిత్ర నీదే" అని గ్రామస్థులు ఆరోపించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తండాలకు 100 రేషన్ కార్డులు మంజూరు చేయబడ్డాయని, పేదలకు సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రుణమాఫీ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను వెంటనే మానుకోవాలని హెచ్చరిస్తూ, ప్రస్తుతం సురేందర్ వెంట తిరుగుతున్న సర్పంచ్‌కే ₹2 లక్షల రుణమాఫీ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.











