తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు వరంగల్ పర్యటన నేపథ్యంలో, తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆయనపై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, వరంగల్ అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాల నిధుల కేటాయింపు వంటి అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. మంత్రి కేటీఆర్ వరంగల్ కు రావడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నాయకులు శ్రీకాంత్ గౌడ్, పర్లపల్లి శ్రీశైలం మాట్లాడుతూ, "పదేళ్ల పాలనలో వరంగల్ రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో కేటీఆర్ ముందుగా చెప్పాలి. దేవాదుల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. ఇరిగేషన్ కోసం భారీగా ఖర్చు చేసినా, వరంగల్ కు ప్రత్యేకంగా ఎలాంటి ప్రాజెక్టును తీసుకురాలేదు" అని ఆరోపించారు. మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ల హామీ ఏమైందని కూడా ప్రశ్నించారు.
కాకతీయ విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, కనీసం హాస్టల్ భవనాలు కూడా నిర్మించలేదని నాయకులు విమర్శించారు. ఐఐటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. విశ్వవిద్యాలయ భూములను ఆక్రమించుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని ఆరోపించారు.
వరంగల్ ను స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పి ఎలాంటి పనులు చేపట్టలేదని, హన్మకొండ బస్టాండ్ ను నిర్లక్ష్యం చేశారని నాయకులు పేర్కొన్నారు. కేటీఆర్ పర్యటనను 'పిట్టల దొర మాటలతో వరంగల్ బిడ్డలను మోసం చేసే ప్రయత్నం'గా అభివర్ణించారు. కేసీఆర్ రాడని సంకేతాలు ఇచ్చేందుకే కేటీఆర్ వరంగల్ వస్తున్నారని కూడా వారు వ్యాఖ్యానించారు.







