భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలు బీజేపీ కార్యకర్తలకు మార్గదర్శకమని అన్నారు. ఖమ్మంలో జరిగిన పార్టీ శిక్షణా శిబిరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం రెండవ పట్టణ కమిటీ మరియు కొణిజర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ శిబిరంలో గల్లా సత్యనారాయణ పాల్గొని ప్రసంగించారు. దేశం కోసం, పార్టీ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతాలు నేటికీ దేశానికి దారిదీపంలా మారాయని తెలిపారు.
ఆయన ప్రతిపాదించిన “ఏకాత్మ మానవతా వాదం (Integral Humanism)” భారతీయ సంస్కృతి, సామాజిక సమానత్వం, సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని గల్లా సత్యనారాయణ వివరించారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఒక గొప్ప తత్వవేత్త, రచయిత మరియు జాతీయవాది అని, ఆయన భారతీయ జనసంఘ్‌కు నాయకత్వం వహించి జాతీయవాద రాజకీయాలకు బలమైన పునాది వేశారని పేర్కొన్నారు.
గ్రామీణ అభివృద్ధి, చివరి వరుసలో ఉన్న పేద ప్రజలకు న్యాయం చేయడం ఆయన ఆలోచనల్లో ముఖ్యమైనవని, “అంత్యోదయ” భావన ద్వారా సమాజంలో చివరి వ్యక్తి అభివృద్ధి చెందితేనే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వసించారని గల్లా సత్యనారాయణ గుర్తు చేశారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవితం సాధారణత, నిబద్ధతకు ప్రతీక అని, ప్రతి బీజేపీ కార్యకర్త ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలని సూచించారు.
దేశభక్తి, సేవాభావం, నైతిక విలువలు ఆయన వ్యక్తిత్వానికి మూలాధారమని తెలిపారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు కార్యకర్తల్లో సిద్ధాంతపరమైన అవగాహన పెంచి పార్టీ బలోపేతానికి దోహదపడతాయని అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల మధ్య పనిచేస్తూ పార్టీని మరింత బలపర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకి చెందిన బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండల, పోలింగ్ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

