రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజాసేవలో ముందుండి, ప్రజల అభిమానాన్ని చూరగొన్న వారికే టికెట్లు కేటాయించడం జరుగుతుందని టిపిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఆయన శనివారం వసంత నగర్ డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమతో ప్రస్తావించిన సమస్యలపై వెంటనే స్పందిస్తూ, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, పార్టీ నాయకుడు సాయిబాబా చౌదరి ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని బండి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, ఇందుకోసం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు.
హైడ్రా ఏర్పాటు కొందరికి కంటగింపుగా మారినప్పటికీ, దానివల్ల కోట్లాది రూపాయల విలువైన నీటి వనరులు, పార్కులు, కుంటలు, చెరువులు రక్షించబడ్డాయని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారని తెలిపారు. సోమవారం కూకట్పల్లిలోని నల్లచెరువును ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబెర్స్, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ. నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు, సేవ్ దళ్ నాయకులు మరియు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

