జ్వరం చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతిని వైద్యుడు లైంగికంగా వేధించారనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని విజయలక్ష్మి హాస్పిటల్లో వైద్యుడు కిరణ్ కుమార్ పై ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. జ్వరం చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన 21 ఏళ్ల యువతికి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వైద్యుడు అనుచితంగా ప్రవర్తించారని, "నువ్వు అందంగా ఉన్నావు" అంటూ తనను తాకాడని బాధితురాలు ఆరోపించింది.
వెంటనే యువతి తన తల్లికి సమాచారం అందించడంతో, ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని, యువతిని అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరుసటి రోజు ఉదయం యువతి కుటుంబ సభ్యులు హాస్పిటల్కు వెళ్లి వైద్యుడిని ప్రశ్నించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
ఈ వాగ్వాదం తర్వాత వైద్యుడిపై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వైద్యుడు కిరణ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో తొర్రూరులో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
పోలీసులు ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, వైద్యుడి నుంచి కూడా వాంగ్మూలం సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. కేసు పూర్వాపరాలు ఇంకా తెలియాల్సి ఉంది.











