స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గురువారం తూంకుంటలోని విశ్వ విశ్వాని కాలేజీలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సహాయ ఎన్నికల నమోదు అధికారులు, బీఎల్వో సూపర్వైజర్లు, బీఎల్వోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
2025 ఓటరు జాబితాలో ఉన్న అర్హులైన ప్రతి ఓటరును 2002 ఓటరు జాబితాతో అనుసంధానం చేసే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బీఎల్వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్ కాలనీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చూడాలని, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సహకారం తీసుకోవాలని సూచించారు. ఓటర్లు కూడా బాధ్యతగా స్పందించి తమ వివరాలను మ్యాపింగ్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
“ఓటరు జాబితాలో పారదర్శకత, ఖచ్చితత్వం కోసం ఈ మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత కీలకం. క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేసి లక్ష్యాన్ని సాధించాలి” అని అడిషనల్ సీఈవో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈఆర్ఓ, కీసర ఆర్డీవో ఎస్. రాజేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్లు, తహసీల్దారులు, బీఎల్వో సూపర్వైజర్లు మరియు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.











