కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఈ తీర్పుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ తన సొంత బ్రాండ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, తద్వారా తెలంగాణ ప్రజల సొమ్మును నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలు, పిట్ట కథలేనని, కేవలం రెండు సంవత్సరాలకే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందని ఆయన ప్రశ్నించారు.
24 గంటల్లో సినిమా చూపిస్తామని చెప్పిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ఎంపీ ప్రశ్నించారు. సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని, వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మానిపోయిన గాయానికి మళ్లీ మందు పెట్టేందుకు కేసీఆర్ బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు.
కేటీఆర్, హరీశ్ రావులు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించిన ఎంపీ, హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఈ ప్రాజెక్టులో దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు.











