ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో, సంగారెడ్డి బస్ డిపో వద్ద జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం పర్యటించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె కారణంగా ఏర్పడిన పరిస్థితులపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆరా తీశారు. సంగారెడ్డి బస్ డిపోను సందర్శించి, డిపో మేనేజర్ ఉపేందర్ తో పాటు ఇతర అధికారులతో సమావేశమై, బస్సులు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని ఆదేశించారు.
సమ్మె శాంతియుతంగా కొనసాగేలా చూడాలని, ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు. డిపో పరిసరాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు, కార్మికులు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఆర్టీసీ బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్న డ్రైవర్లు జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739 కు సంప్రదించాలని సూచించారు.
తాత్కాలికంగా విధుల్లో చేరే డ్రైవర్లకు, తిరిగి విధుల్లో చేరే ఆర్టీసీ డ్రైవర్లకు పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో డీఎస్పీ సత్తయ్య గౌడ్, సంగారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణరెడ్డి, కొండాపూర్ సీఐ కుమన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












