ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ విద్యా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు, పుస్తకాలు అందడం లేదని, మధ్యాహ్న భోజన పథకం అమలులోనూ సమస్యలున్నాయని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేషనల్ యూత్ ప్రాజెక్ట్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్, దక్షిణ ఆసియా మైత్రి సదస్సు ప్రతినిధులు వి.సత్య గౌడ్, బి.ఆర్. నర్సింగరావు బుధవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ వెంటనే అందజేయాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి నాణ్యమైన భోజనం అందించాలని వారు కోరారు.
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చుకొని, పుస్తకాలు, యూనిఫాంలు వంటివి విద్యార్థులపై బలవంతంగా కొనుగోలు చేయిస్తూ, నర్సరీ స్థాయి నుంచే లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను కుదించే ప్రతిపాదనలు విద్యా వ్యవస్థకు, గ్రామీణ, ఆదివాసీ, దళిత, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగిస్తాయని వారు హెచ్చరించారు. పాఠశాలల సంఖ్యను తగ్గించకుండా, జనాభా ప్రాతిపదికన కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసి, ఉన్నవాటిని బలోపేతం చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును కచ్చితంగా అమలు చేయాలని కోరారు.
ఇంకా, వ్యాయామ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, డైట్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎనిమిది నెలలుగా వేతనాలు అందడం లేదని, వారిని కాంట్రాక్ట్ విధానంలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ సబ్జెక్ట్ ఉపాధ్యాయులను, వ్యాయామ డైరెక్టర్లను కన్సాలిడేటెడ్ వేతనంతో నియమిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.











