కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం మాట్లాడుతూ, కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని, విద్యార్థులకు ఉత్తమమైన బోధన అందుతుందని తెలిపారు.
ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు అదృష్టవంతులని, వారు అన్ని రంగాలలో రాణించేలా అధ్యాపకులు కృషి చేస్తారని షేక్ సలాం పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలోనూ రాణించాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ విద్యా సంవత్సరం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు, అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని నోడల్ అధికారి తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో అధ్యాపకులు సమష్టిగా కృషి చేస్తూ, కళాశాల అభివృద్ధికి, అడ్మిషన్ల పెంపునకు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, అడ్మిషన్ల సంఖ్యను మరింత పెంచేందుకు విద్యార్థులు, అధ్యాపకులు సహకరించాలని కోరారు. నిరుపేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాల వంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా విద్యా బోధన జరుగుతుందని, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి మంచి విద్యార్థులుగా రాణించి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని ఆయన ఆకాంక్షించారు.










