శ్రీ సరస్వతీ విద్యామందిర్ హై స్కూల్, కామారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల పూర్వ విద్యార్థులను, వివిధ పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించే కార్యక్రమం జరిగింది.
ఈ సన్మాన సభలో భారత ఆర్మీ, నేవీలో సేవలందిస్తున్న పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులను, ఇంటర్మీడియట్, డిగ్రీ, మరియు ఇతర పోటీ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
గణేష్, హర్విందర్ సింగ్ (ఆర్మీ), అజయ్ (నేవీ), హిమవంతుడు (డిగ్రీలో 9.7 CGPA), శేషాద్రి (JEE అడ్వాన్స్లో 636వ ర్యాంక్) వంటి విద్యార్థులు అభినందనలు అందుకున్నారు. గత సంవత్సరం ఒలంపియాడ్ పరీక్షలలో రెండవ స్థాయికి ఎంపికైన విద్యార్థులను కూడా అభినందించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల, విద్యాపీఠం ప్రతినిధులు, ప్రబంధకారిణి సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












