తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, జిల్లాలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన వారి కుటుంబాలను మంత్రి ఘనంగా సన్మానించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. అమరవీరుల ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి అభినందించారు.
వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన మంత్రి, అక్కడి కార్యక్రమాలు, సేవలపై వివరాలు తెలుసుకున్నారు. నలుగురు దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు ల్యాప్టాప్లను, 768 స్వయం సహాయక సంఘాలకు రూ.69.19 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణ చెక్కులను, ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పీఎం శ్రీ పాఠశాలల్లో వేసవి శిబిరాలలో సేవలు అందించిన ప్రధానోపాధ్యాయులను సన్మానించారు.
వేడుకల్లో భాగంగా, ఐబీ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












