నిజామాబాద్, ఆగస్టు 1
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, కార్మిక–గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శనివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)ను సందర్శించి, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి వస్తున్న వరద ప్రవాహాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, కార్మిక–గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శనివారం పరిశీలించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టులో ప్రస్తుత నీటి ప్రవాహం, నిల్వలు, ఎగువ ప్రాంతాల పరిస్థితిపై అధికారులు మంత్రులకు వివరించారు. గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజీలు, కడెం తదితర జలాశయాల నుంచి గోదావరి ద్వారా వరద నీరు ఎస్సారెస్పీకి చేరుతోందని తెలిపారు. వర్షాలు తగ్గినా మరో 48 గంటల పాటు ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,072.30 అడుగుల వద్ద 27.376 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. శనివారం మధ్యాహ్నానికి సుమారు 85 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోందని తెలిపారు. ప్రస్తుత నిల్వలను పరిగణనలోకి తీసుకుని ఆయకట్టు పంటలకు నీటి విడుదలపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. గత ఏడాది ఇదే సమయానికి 38 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం 27 టీఎంసీలకే పరిమితమైందన్నారు. పూడిక పేరుకుపోవడంతో ఒకప్పుడు 112 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఎస్సారెస్పీ ప్రస్తుతం 80 టీఎంసీలకు తగ్గిందని చెప్పారు. ప్రాజెక్టులో పూడిక తొలగించి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే 2019లో నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కొద్ది కాలంలోనే దెబ్బతిన్నాయని విమర్శించారు. ఆ బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనం ఆధారంగా ముందుకు సాగుతోందని, దీనికి జాతీయ డ్యాం భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం కూడా సమ్మతించాయని తెలిపారు.











