శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో విద్యుత్ కేబుల్ చోరీ కలకలం సృష్టించింది. సుమారు 40 మీటర్ల కాపర్ విద్యుత్ కేబుల్‌ను దొంగలు అపహరించుకెళ్లారు. ఈ ఘటనలో సుమారు మూడు లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా.
శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ఈ విద్యుత్ కేబుల్ చోరీపై అధికారులు విచారణ చేపట్టారు. విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగుతుండగానే, దొంగలు పదునైన ఆయుధాలతో కేబుల్‌ను కట్ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించారు.
అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అప్రమత్తమైన గని అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గనిని పరిశీలించారు. అప్పటికే దొంగలు అక్కడి నుంచి పరారైనట్లు నిర్ధారించారు.
దొంగలు ఓబి బెంచ్‌ల మీదుగా గనిలోకి ప్రవేశించి, దొంగతనం అనంతరం అదే మార్గంలో తప్పించుకున్నట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయని ఓసిపి అధికారులు వెల్లడించారు.
ఈ చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, దర్యాప్తునకు సహకరిస్తామని అధికారులు తెలిపారు. కేబుల్ విలువ సుమారు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.











